ఇలాతల సోయగమ్ములపై
నా తనువు తహతహలాడె
అలా నీ ఆంతర్యంలో అంతర్లీనం కావాలని
నా మనస్సు మధనపడుతుంది
అటు తనువు
ఇటు మనస్సు
రెండింటి మధ్య నేను
వాటిని సమన్వయపరచలేక
సతమతమవుతున్నాను
బంధాలు
అనుబంధాలు
సంబంధాలు
అను బాంధవ్యాలలో
చిక్కుకున్న నేను
ఈ బంధవిముక్తుడును
కాలేకున్నాను
నా యద చెదపొదలు
నీ దరికి రాకుండా
నన్నాపేస్తున్నాయి
అంతరాలలో ఏదో అలజడి
గుండె ఘోషిస్తుంది
అయినా ఏదో కావాలి నాకు
ఏదో పొందాలి నీ నుండి
అదేదో స్ధిరమనస్సట
మనశ్శాంతట
ఆ ప్రశాంతి కొరకే నీ దరిచేరా
అడుగడుగునా కడిగావు
నా మది మరకలు తుడిచావు
యెదవ్యధలు తొలగించావు
నా గుండె గదినిండా పన్నీటి సుధలు కురిపించావు
నీ సాగర జలంతో నా పాత్ర నింపావు
ప్రేమజలాన్ని నింపుకున్న నా హృది
ఆనందంతో నాట్యం చేసింది
తీరా ఇంటికి చేరేసరికి
పాత్ర ఖాళీ అయిపోయింది
మళ్ళీ వచ్చా నీ దరికి
మళ్ళీ నా పాత్ర నింపావు
నీ కరుణరసంతో
మళ్ళీ ఖాళీ అయిపోయింది
మళ్ళీ మళ్ళీ వచ్చా, నీ దరికి
మళ్ళీ నా పాత్ర నింపావు
నీ రక్షణామృతంతో
మళ్ళీ ఖాళీ అయిపోయింది
ఏమిటబ్బా అనుకొన్నా
తీరా చూస్తే ఆ పాత్ర నిండా చిల్లులే
స్వార్ధం,ద్వేషం, పగ
కక్ష, కార్పణ్యాలు, కల్మషం
ఆ చిల్లులకు కూడా
నీవే కాస్తా మాట్లు వేసి
నా మది నవతరించవయ్యా
మంత్రతంత్రాలతో నిండిన
నా మనోయంత్రాన్ని
నియంత్రించవయ్యా.