Sunday, February 12, 2012

ఏ కులం?

ఏ కులం ?
ఏకు'లం
'మేకు'లం
కులం
'మరమేకు'లం
మరకలం
'మర'కులం
కార్మికులం
కారకులం
ఉత్పత్తి కారకులం
ఉత్పాదకులం
ఉపయోగకులం
కారకాల్లో నొక కారకులం
శ్రమకారకులం
శ్రామికులం


ఏకులో ఏకునై
మేకులో మేకునై
మరమేకులో మరమేకునై
మరలో మరనై
మానవావయాల మరనై
కారకాల్లో నొక కారకాన్నై
’శ్రమ’కారకినై
శ్రమిస్తాం సహనంతో
కష్టిస్తాం కరములతో
అందిస్తాం అవసరాలను
నిరంతరం నిత్యావసరాలను


శ్రామశక్తిని ధారబోసిన శ్రామికులం
వినియోగదారునికి అవసరాలను
అందించే అర్పకులం
మరి మాకుందా కష్టఫలం?
కనీస అవసరాలను తీర్చే కనీస ఫలం?
శ్రామిక యజ్ఞఫలం?...


చూస్తున్నారుగా ఆకాశాన్నంటుతున్న ధరలు
ఉర్రూతలూగిస్తున్న ధరలు చాలవా?
ఇస్తున్నారా పెరుగుతున్న కరువుకు తగ్గ బతైం
సంవత్సరాని కొకసారిచ్చే బోనస్ ల బుజ్జగింపులు
తీరుస్తుందా కార్మికుల కనీస అవసరాలు


మరి ఈ వస్తు సముదాయానికి
కారకులయిన కార్మికుల
అనుకూలం ప్రతికూలిస్తే
సహనం సన్నగిల్లితే
ఏకు మేకైతే
మరమేకుకు మాటలొస్తే
స్తంభన
కాదా వస్తు స్తంభన
తస్మాత్ జాగ్రత్త.

No comments:

Post a Comment