Sunday, February 12, 2012

నిమజ్జనం

కాష్టం కాలుతుంది
శవం మాత్రం బూడిదవడంలేదు
గంగలో కలిపేదెప్పుడు?
ఆత్మ శాంతించేదెప్పుడు?


కాలుతున్న చీకటి మంటల్లో నుండి
చిమ్ముతున్న రక్తం పైపైకెగసి
లోకమంతా ప్రాకుతుంది
నీడలేవో వెంటాడుతున్నాయి
పీడలేవో పరామర్శిస్తున్నాయి
ప్రేతాత్మలేవో పీడిస్తున్నాయి
చరిత్ర హీనులెవరో
వర్తమానాన్ని వెనక్కి లాగేస్తున్నారు


చిమ్మచీకటి మంటల్లో
వెలుతురు కోసం వెతుకుతున్నారు
తెల్లటి వెలుతురు చినుకులకు
నల్లటి చీకటి గొడుగడ్డం పెట్టి
వెలుతురును ఆస్వాదించలేకపోతున్నారు


పాపం,దీపం
దీపపు వెలుగుకై వెతుకుతోంది
శాపం, తనే వొక దీపం అని
తెలుసుకోలేకపోతోంది.


అవినీతి చీకట్లు ఆకాశాన్నంటక ముందే
జగతి గోడలు చిట్లకముందే
జనత గుండెలు బ్రద్దలవకముందే
భవిత భగ్గుమనకముందే
ఉన్మాదపు కాష్టాన్ని వెలుతురు
చినుకులతో తగలబెడదాం
మతోన్మాదపు బూడిదను
మానస సరోవరంలో కలుపుదాం


అప్పుడే
నీతి సూర్యుని తెజం
మానవత్వపు కాంతిపుంజం
శాంతిసుగంధం వెదజల్లే
వెలుగురేఖల వర్షం
కురిపించే కవి హర్షం.

No comments:

Post a Comment